Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారతీయ ఆయుర్వేద ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్ ప్రత్యేక సైట్

  • గ్లోబల్ ఆయుర్వేద మీట్-2019’లో  అమెజాన్ అధికారి రచిత్ జైన్ వెల్లడి
  • నాణ్యమైన ఉత్పత్తులకు మాత్రమే అవకాశమన్న అమెజాన్
  • ఇప్పటికే అమెజాన్ లో 50వేలమంది ఆయుర్వేద సెల్లర్స్
ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పత్తులను, ఆయుర్వేద చికిత్సను విశ్వ వ్యాప్తం చేయడానికి ప్రముఖ ఆన్ లైన్ విక్రయ సంస్థ అమెజాన్ ముందుకు వచ్చింది. ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకానికి  ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను రూపొందిస్తోంది. ఇది కేవలం భారతీయ ఆయుర్వేద ఉత్పత్తుల తయారీదారులకోసమేనని పేర్కొంది. 

కేరళలో సీఐఐ(కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) నేతృత్వంలో నిర్వహించిన ‘గ్లోబల్ ఆయుర్వేద మీట్-2019’ సదస్సులో పాల్గొన్న అమెజాన్ ఇండియా, గ్లోబల్ సెల్లింగ్ హెడ్ రచిత్ జైన్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ప్రారంభించనున్న కొత్త సైట్ ఆయుర్వేద ఉత్పత్తిదారులకు మార్కెట్ పెంచుతుందని చెప్పారు. ఆయుర్వేదంతో పాటు హెర్బల్, బ్యూటీ ఉత్పత్తులు కూడా  అమెజాన్ కు ముఖ్యమని చెప్పారు. 

అమెజాన్ లో ఆయుర్వేదానికి సంబంధించి భారత్ నుంచి 50,000కి పైగా సెల్లర్స్ ఉన్నారని, వారందరికీ కొత్త సైట్ మరింత ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.  అయితే, తమ ఉత్పత్తులకు సంబంధించి అవి విక్రయించబడే దేశాలలో నిబంధనలకు లోబడి వారు ఉండాలని పేర్కొన్నారు. అమెజాన్‌లో విక్రయించాలనుకునే తయారీదారుల ఉత్పత్తుల్లో నాణ్యమైన వాటినే ఎంపిక చేస్తామని జైన్ పేర్కొన్నారు.
amazon
ayurvedic
manufacturers
India

More Telugu News